నాకు చిన్నప్పటి నుండి మొక్కలంటే చాలా ఇష్టం,ఆదీ పూల మొక్కలు అంటే మరీనూ. చిన్నప్పుడు ముద్ద మందార పువ్వులు కూడా వదలకుండా రెండు జడలలో రెండు పెట్టుకునేదానిని, అందరూ నవ్వినా సరే. కానీ మేము చిన్నప్పటి నుండీ మొక్కలు పెంచుకోవడానికి వీలు లేని ఇళ్లలోనే వుండవలసి వచ్చింది. మా అమ్మ జాబ్ చేసేది కనుక తనకు అనుకూలంగా వుండే మేడ మీద ఇళ్లలొనే వుండేవాళ్ళం. ఇక పెళ్లయిన తర్వాత కూడా అపార్ట్మెంట్ లొనే.
అప్పుడు వచ్చింది బంగారం లాంటి అవకాశం, 7ఏళ్ల తర్వాత అదృష్టవశాత్తు పెరడు వున్న ఇంట్లోకి మారాం. అప్పుడు ఇక నా సంతోషం అంతా ఇంతా కాదు.పెరట్లో ఎమి మొక్కలు వెయ్యాలి అని రోజూ ఆలోచనలు,వాటిని గురించే కలలు. ఎట్టకేలకు ఒక నందివర్ధనం, ఒక మందారం,ఒక సెంటు జాజి,కొన్ని దేవ గన్నేరు చెట్లు నాటడము జరిగింది.అప్పటి నుంచి అవి చిగురు వేసినా, ఇంట్లో దాని గురించే ముచ్చట్లు.ఇక మొగ్గ వేసినప్పటి నుండీ పువ్వులు అయ్యేంతవరకూ అదే ధ్యాస,ఆత్రంగా ఎదురు చూడటం..పూలు పూసినప్పుడు ఇల్లంతా పండగే పండగ..
ఇలాంటి పరిస్థితిలో మా జాజి తీగ మా ఆశలకు అనుగుణంగా పెరిగి ప్రహరీ గోడ అంతా పాకింది. అప్పుడు ఆ మల్లె చెట్టుకు పందిరి వేశాము. ఇక ఆ పందిరి, దాని మీద అల్లుకున్న మల్లె చెట్టు అందం చెప్ప నలవి కాదు. రోజూ ఉదయం రెండు నిమిషాలు పందిరి అందంచూసి మైమరిచి పోయే వాళ్ళం. అది మా దిన చర్య అయిపోయింది. మా ఆనందానికి తగ్గట్టుగా మల్లె అందం గా,వయ్యారంగా చిగుర్లు వేస్తూ,మొగ్గలు వేస్తూ పోయింది. సాయంకాలం అవగానే టివి వదలని నా కూతురు మొగ్గలు కొయ్యడానికి సిద్దంగా వుండేది. మేము ఆ పువ్వులను కోసి మాల అల్లు కుంటూ పక్క ఇంటి ఆంటీ తో నూ,వెనక ఇంటి అక్క తోనూ కబుర్లూ,పని మనిషి కష్టాలు,పిల్లల చదువులూ,పెళ్లిళ్ల విశేషాలు అన్నీ పంచుకునే వాళ్ళం.ఒక రకం గా మా జీవితంలో కొత్త భాగం అయిపోయింది ఆ మల్లె పందిరి. మా పడగ్గది కిటికీ తెరవగానే తన సువాసనలతో మరిపించేది. వర్షం వచ్చి వెలసిన తరువాత చూడాలి దాని సొగసులు.కార్తీకంలో మంచు బిందువులను అద్దుకుని చిత్ర విచిత్రమైన సొయగాలను ఆవిష్కరించేది. మా పిల్లలు సాయంకాలం చదువు కొవాలన్నా, సంగీతం సాధన చెయ్యాలి అన్నా, నేను నవలలు చదవాలన్నా,మావారు ంంన్యూస్ పేపర్ చదవాలన్నా మల్లె చెట్టు ఎదురుగా వున్న స్థలమే వేదికయ్యేది. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని జ్ఞాపకాలు.. ఇలా మా జీవితంలో మరపురాని ఒక భాగం ఐన మల్లె చెట్టు,మేము ఇల్లు మారినప్పుడు మాకు దూరం అయిపోయింది. తొమ్మిదేళ్ల పాటు మల్లెచెట్టు మాతో పెనవేసుకున్న బంధం మా ఙ్ఞాపకాలలో ఒక అపూర్వమైన మధుర భావన లా మిగిలి పోయింది...
No comments:
Post a Comment