అందరికీ సంక్రాంతి పండగ అంటూనే పల్లె,సొంతూరు, ధాన్యాలు,ముగ్గులు,రంగులు,హుషారు..సంక్రాంతి ఆంటేనే పల్లె.నేను పుట్టి పెరిగినది అంతా పట్నం అవటం తో పల్లె వాసనలు తక్కువే. మేము గాలిపటాలు చెయ్యటం,ఎగరెయ్యటం బాగా చేసే వాళ్ళం,ఇక రంగవల్లులు సరే సరి,పోటీలు పడి వేసేవారు. పిండి వంటలు,ఆటలు,ముగ్గులు ఇలా వున్నప్పుడు మా నాన్న గారికి తిరుపతి బదిలీ అయ్యింది. అక్కడ భోగి రొజు ఉదయాన్నే ప్రతి ఒక్కరూ భోగి మంటలు వేసి,పెద్ద పెద్ద ముగ్గులు వేసే వారు. పెద్దలు ఉదయాన్నే కోడి కూర వండి ఇడ్లీలో,దోశ లో టిఫిన్ కి రెడీగా చేసే వాళ్ళు. మళ్లీ సాయంకాలం అప్పటికి ఇల్లు తుడుచుకుని ఉదయం పెద్ద పండగ కి తయారు. ఎంత పని చేసే వారో.
తిరుపతి లో వున్నన్నాళ్లూ భోగి మంటలు మాకు అలవాటయింది,వారం ముందు నుండీ కట్టె పుల్లలు,మా ఇంటి వెనుక తోటలో ఎండు పుల్లలు ఏరుకొని వస్తూ వస్తూ మా ఓనరు నీళ్ళు కాచుకోడానికి వుంచుకున్న కట్టెలు నాలుగు తస్కరించి సిద్దం చేసుకునే వాళ్ళం.ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసేవాళ్ళం. మళ్లీ సొంతూరికి వచ్చిన తరువాత ఇక్కడ భోగి మంటలు వెయ్యరు,మనం వెయ్యాలా వద్దా అని ధర్మసందేహం. సరదా వదులుకోలే క వెయ్యటం చేస్తూఉన్నాము. వాటికి మా అమ్మమ్మ తన వంతుగా కొబ్బరి మట్టలు,పాత సామాను తీసి దాచి ఉంచేది.
ఇక మా పిల్లలు వచ్చిన తరువాత కథ మారి పోయింది. రాత్రి పూట లేట్ అవుతుంది టి వి చూడటం,రేపు సెలవే గా అమ్మా అంటూ ఉదయం లేవడానికి బద్దకించటం. సరదా వుంటుంది కానీ , పుల్లలు,కర్రలు తేవటం లాంటివి చెయ్యాలని తాపత్రయం పడరు.ఒక సారి పని లో పడి నేను పండక్కి కావలసిన వస్తువులు ఏవీ పట్టించుకోలేదు. ఇంటికి రావడానికి రాత్రి ఎనిమిది దాటిపోయింది. ఇంటికి వచ్చేక,పిల్లలు అమ్మా భొగిమంటలు వెయ్యడానికి ఏమీ లేవు కదా అన్నీ వెతికి ఏమీ దొరక్క బిక్కమొహాలు వేసారు. మా అబ్బాయి ఏడుపు ఒక్కటే తక్కువ వాడికి.చాలా ఆలోచన చేసి స్కూటీ లో ఇంటి దగ్గర వున్న కట్టెల డిపో కి వెళ్లాము. డిపో వాడు అప్పటి కే నిద్దురలో వున్నాడు.వాళ్ళావిడ ను బతిమాలితే చీకట్లో పురుగు పుట్ర వుంటాయి నేను ఇప్పుడు ఇవ్వను అంటుంది. మా అబ్బాయి ఆంటీ ప్లీజ్ అని అడుగుతూ వుంటే డిపో వాడు లేచిఎన్ని కట్టెలు కావాలని అడిగాడు.నాలుగు చాలండి అంటే వాడు మింగేసేలా చూసి మణుగు తీసుకుంటే ఇస్తా లేకపోతే లేదు అన్నాడు. అన్ని నేను ఏమి చేసుకోను అని 20రూపాయలవి ఇవ్వమన్నా వాడు తిడ తాడెమో అని భయపడుతూ. వాడు ఇక విసిగిపోయి గొణుక్కుంటూ ఇచ్చాడు,అప్పుడు వాడి భార్య జాలి పడి ఇంత రాత్రి ఎందుకు వచ్చారమ్మా అని కట్టెలు జాగ్రత్తగా బండిలో పెట్టి పంపింది. ఉదయాన్నే భోగి మంటలు వేశాక మిగిలిన కర్రలు ఏం చేయాలో అని అనుకుంటుంటే మా అబ్బాయి వచ్చి నెక్స్ట్ ఇయర్ భోగికి పనికి వస్తాయని జాగ్రత్తగా దాచాడు. ఈ జనరేషన్ పిల్లలకి మట్టి, పల్లెలు,చేలు,ఆటలు ఇవ్వన్నీ తెలియవు కానీ మనం పాత సరదాలు కొన్నిటిని అయినా పరిచయం చేస్తే వాటిని ఎంజాయ్ చెయ్యడం మాత్రం పోగొట్టుకోరు అని ఆ క్షణం అనిపించింది.
No comments:
Post a Comment