Monday, 23 November 2020

వరండా

 ఇది మనకు సుపరిచితమైన పదమైనా ఇప్పటి పిల్లలకి పెద్దగా తెలియకపోవచ్చు. వరండా అనగానే నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి ని కానీ,ఆత్మీయులను తలచుకుంటే కలిగే ఆనందం కలుగుతుంది. ఎందుకో తెలియని అనుబంధం చిన్నప్పటి నుండీ ఏర్పడింది.

   మా చిన్నప్పుడు మాది రెండు వాటాలు వున్న చిన్న ఇల్లు. రెండు వాటాలకు ఒక్కటే వరండా. పిల్లలంతా కలిసి తాడాట, తొక్కుడు బిళ్ల,గాజు పెంకులాట, అచ్చన రాళ్లు, ఇలా ఉదయం నుండి సాయంకాలం దాకా  వేసవి సెలవులు , ఆదివారాలు వరండా లో నే గడిపే వాళ్ళం. ఇక మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద వరండా వుండేది.మామయ్య పిల్లలు, పక్కింటి పిల్లలు, మేము కలిసి అక్కడ మళ్లీ క్రికెట్,కారంస్,ఛెస్ లాంటి ఆటలు ఆడేవాళ్ళం. మా అమ్మమ్మ బియ్యం,మిర్చి, పప్పులు,వడియాలు అన్ని వరండా లో ఎండపెట్టి , అక్కడే  కూర్చుని చక్కగా పేపర్, నవలలు చదివేది. సాయంత్రం అక్కడే కూర్చుని పువ్వులు అల్లేది, మా అల్లరి ఎక్కువ అయ్యింది అని తిట్టి హోమ్ వర్క్ కూడా అక్కడే చేయించేది.  వేసవి కాలంలో వేడి తట్టుకోలేక వరండా అంతా నీరు పెట్టి, ఆరిన తరువాత చాపలేసుకుని పడుకొంటే ఎంత చల్లగా వుండేదో. ఇక శుభ కార్యాలప్పుడు  ఎంత మంది చుట్టాలు వచ్చినా , కూచోడానికి , పడుకోడానికి ఆదుకునేది వరండా నే. పెళ్లిళ్ల సమయంలో పూలు గుచ్చడానికి, పూలు వరండా లో రాశి పోసి ఆడంగులందరు చుట్టూ కూచుని కబుర్లు చెప్పుకుంటూ మాలలు కట్టేవారు.  లడ్డూ చుడతానికి బూందీ పాకం పెద్ద గిన్నెలు పెట్టుకొని అందరూ కలిసి కబుర్లతోపాటుగా పాటలు పాడుతూ లడ్డూలను చేసే వాళ్ళు.  ఒక్కో సారి సరదా ముదిరి పాత విషయాలను గుర్తు చేసుకుని చిన్న చిన్న గొడవలు కూడా జరిగాయి. 

 ఇన్ని రకాలు గా ఉపయొగకరం అయిన వరండా చివరకు ఇంట్లో ఎవరైనా చనిపోతే అందరూ చూడటానికి వీలుగా శవాన్ని వుంచేది కూడా వరండా లోనే....

Monday, 9 November 2020

భోగి మంటలు

 అందరికీ సంక్రాంతి పండగ అంటూనే పల్లె,సొంతూరు, ధాన్యాలు,ముగ్గులు,రంగులు,హుషారు..సంక్రాంతి ఆంటేనే పల్లె.నేను పుట్టి పెరిగినది అంతా పట్నం అవటం తో పల్లె వాసనలు తక్కువే. మేము గాలిపటాలు చెయ్యటం,ఎగరెయ్యటం బాగా చేసే వాళ్ళం,ఇక రంగవల్లులు సరే సరి,పోటీలు పడి వేసేవారు. పిండి వంటలు,ఆటలు,ముగ్గులు ఇలా వున్నప్పుడు మా నాన్న గారికి తిరుపతి బదిలీ అయ్యింది. అక్కడ భోగి రొజు ఉదయాన్నే ప్రతి ఒక్కరూ భోగి మంటలు వేసి,పెద్ద పెద్ద ముగ్గులు వేసే వారు. పెద్దలు ఉదయాన్నే కోడి కూర వండి ఇడ్లీలో,దోశ లో టిఫిన్ కి రెడీగా చేసే వాళ్ళు. మళ్లీ సాయంకాలం అప్పటికి ఇల్లు తుడుచుకుని ఉదయం పెద్ద పండగ కి తయారు. ఎంత పని చేసే వారో.

    తిరుపతి లో వున్నన్నాళ్లూ భోగి మంటలు మాకు అలవాటయింది,వారం ముందు నుండీ కట్టె పుల్లలు,మా ఇంటి వెనుక తోటలో ఎండు పుల్లలు ఏరుకొని వస్తూ వస్తూ మా ఓనరు నీళ్ళు కాచుకోడానికి వుంచుకున్న కట్టెలు నాలుగు తస్కరించి సిద్దం చేసుకునే వాళ్ళం.ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసేవాళ్ళం. మళ్లీ సొంతూరికి వచ్చిన తరువాత ఇక్కడ భోగి మంటలు వెయ్యరు,మనం వెయ్యాలా వద్దా అని ధర్మసందేహం. సరదా వదులుకోలే క వెయ్యటం చేస్తూఉన్నాము. వాటికి మా అమ్మమ్మ తన వంతుగా కొబ్బరి మట్టలు,పాత సామాను తీసి దాచి ఉంచేది. 

 ఇక మా పిల్లలు వచ్చిన తరువాత కథ మారి పోయింది. రాత్రి పూట లేట్ అవుతుంది టి వి చూడటం,రేపు సెలవే గా అమ్మా అంటూ ఉదయం లేవడానికి బద్దకించటం. సరదా వుంటుంది కానీ , పుల్లలు,కర్రలు తేవటం లాంటివి చెయ్యాలని తాపత్రయం పడరు.ఒక సారి పని లో పడి నేను పండక్కి కావలసిన వస్తువులు ఏవీ పట్టించుకోలేదు. ఇంటికి రావడానికి రాత్రి ఎనిమిది దాటిపోయింది. ఇంటికి వచ్చేక,పిల్లలు అమ్మా భొగిమంటలు వెయ్యడానికి ఏమీ లేవు కదా అన్నీ వెతికి ఏమీ దొరక్క బిక్కమొహాలు వేసారు. మా అబ్బాయి ఏడుపు ఒక్కటే తక్కువ వాడికి.చాలా ఆలోచన చేసి స్కూటీ  లో ఇంటి దగ్గర వున్న కట్టెల డిపో కి వెళ్లాము. డిపో వాడు అప్పటి కే నిద్దురలో వున్నాడు.వాళ్ళావిడ ను బతిమాలితే చీకట్లో పురుగు పుట్ర వుంటాయి నేను ఇప్పుడు ఇవ్వను అంటుంది. మా అబ్బాయి ఆంటీ ప్లీజ్ అని అడుగుతూ వుంటే డిపో వాడు లేచిఎన్ని కట్టెలు కావాలని అడిగాడు.నాలుగు చాలండి అంటే వాడు మింగేసేలా చూసి మణుగు తీసుకుంటే ఇస్తా లేకపోతే లేదు అన్నాడు. అన్ని నేను ఏమి చేసుకోను అని 20రూపాయలవి ఇవ్వమన్నా వాడు తిడ తాడెమో అని భయపడుతూ. వాడు ఇక విసిగిపోయి గొణుక్కుంటూ ఇచ్చాడు,అప్పుడు వాడి భార్య జాలి పడి ఇంత రాత్రి ఎందుకు వచ్చారమ్మా అని కట్టెలు జాగ్రత్తగా బండిలో పెట్టి పంపింది. ఉదయాన్నే భోగి మంటలు వేశాక మిగిలిన కర్రలు ఏం చేయాలో అని అనుకుంటుంటే మా అబ్బాయి వచ్చి నెక్స్ట్ ఇయర్ భోగికి పనికి వస్తాయని జాగ్రత్తగా దాచాడు. ఈ జనరేషన్ పిల్లలకి మట్టి, పల్లెలు,చేలు,ఆటలు ఇవ్వన్నీ తెలియవు కానీ మనం  పాత సరదాలు కొన్నిటిని అయినా పరిచయం చేస్తే వాటిని ఎంజాయ్ చెయ్యడం మాత్రం పోగొట్టుకోరు అని ఆ క్షణం అనిపించింది.

Tuesday, 3 November 2020

మల్లె చెట్టు

 నాకు చిన్నప్పటి నుండి మొక్కలంటే చాలా ఇష్టం,ఆదీ పూల మొక్కలు అంటే మరీనూ. చిన్నప్పుడు ముద్ద మందార పువ్వులు కూడా వదలకుండా రెండు జడలలో రెండు పెట్టుకునేదానిని, అందరూ నవ్వినా సరే. కానీ మేము చిన్నప్పటి నుండీ మొక్కలు పెంచుకోవడానికి వీలు లేని ఇళ్లలోనే వుండవలసి వచ్చింది. మా అమ్మ జాబ్ చేసేది కనుక తనకు అనుకూలంగా వుండే మేడ మీద ఇళ్లలొనే వుండేవాళ్ళం. ఇక పెళ్లయిన తర్వాత కూడా అపార్ట్మెంట్ లొనే. 

      అప్పుడు వచ్చింది బంగారం లాంటి అవకాశం, 7ఏళ్ల తర్వాత అదృష్టవశాత్తు పెరడు వున్న ఇంట్లోకి మారాం. అప్పుడు ఇక నా సంతోషం అంతా ఇంతా కాదు.పెరట్లో ఎమి మొక్కలు వెయ్యాలి అని రోజూ ఆలోచనలు,వాటిని గురించే కలలు. ఎట్టకేలకు ఒక నందివర్ధనం, ఒక మందారం,ఒక సెంటు జాజి,కొన్ని దేవ గన్నేరు చెట్లు నాటడము జరిగింది.అప్పటి నుంచి అవి చిగురు వేసినా,  ఇంట్లో దాని గురించే ముచ్చట్లు.ఇక మొగ్గ వేసినప్పటి నుండీ పువ్వులు అయ్యేంతవరకూ అదే ధ్యాస,ఆత్రంగా ఎదురు చూడటం..పూలు పూసినప్పుడు  ఇల్లంతా పండగే పండగ..

            ఇలాంటి పరిస్థితిలో  మా జాజి తీగ మా ఆశలకు అనుగుణంగా పెరిగి ప్రహరీ గోడ అంతా పాకింది. అప్పుడు ఆ మల్లె చెట్టుకు పందిరి వేశాము. ఇక ఆ పందిరి, దాని మీద అల్లుకున్న మల్లె చెట్టు అందం చెప్ప నలవి కాదు. రోజూ ఉదయం రెండు నిమిషాలు పందిరి అందంచూసి మైమరిచి పోయే వాళ్ళం. అది మా దిన చర్య అయిపోయింది.  మా ఆనందానికి తగ్గట్టుగా మల్లె అందం గా,వయ్యారంగా చిగుర్లు వేస్తూ,మొగ్గలు వేస్తూ పోయింది. సాయంకాలం అవగానే టివి వదలని నా కూతురు మొగ్గలు కొయ్యడానికి సిద్దంగా వుండేది. మేము ఆ పువ్వులను కోసి మాల అల్లు కుంటూ పక్క ఇంటి ఆంటీ తో నూ,వెనక ఇంటి అక్క తోనూ కబుర్లూ,పని మనిషి కష్టాలు,పిల్లల చదువులూ,పెళ్లిళ్ల విశేషాలు అన్నీ పంచుకునే వాళ్ళం.ఒక రకం గా మా జీవితంలో కొత్త భాగం అయిపోయింది ఆ మల్లె పందిరి. మా పడగ్గది కిటికీ తెరవగానే తన సువాసనలతో మరిపించేది. వర్షం వచ్చి వెలసిన తరువాత చూడాలి దాని సొగసులు.కార్తీకంలో మంచు బిందువులను అద్దుకుని చిత్ర విచిత్రమైన సొయగాలను ఆవిష్కరించేది. మా పిల్లలు సాయంకాలం చదువు కొవాలన్నా, సంగీతం  సాధన చెయ్యాలి అన్నా, నేను నవలలు చదవాలన్నా,మావారు ంంన్యూస్ పేపర్ చదవాలన్నా మల్లె చెట్టు ఎదురుగా వున్న స్థలమే వేదికయ్యేది. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని జ్ఞాపకాలు.. ఇలా మా జీవితంలో మరపురాని ఒక భాగం ఐన మల్లె చెట్టు,మేము ఇల్లు మారినప్పుడు మాకు దూరం అయిపోయింది. తొమ్మిదేళ్ల పాటు మల్లెచెట్టు మాతో పెనవేసుకున్న బంధం మా ఙ్ఞాపకాలలో ఒక అపూర్వమైన మధుర భావన లా మిగిలి పోయింది...

Saturday, 17 October 2020

లడ్డూలు

 నాకు పెళ్ళిళ్ళు అన్నా ,చిన్నా చితకా  ఫంక్షన్ లు అన్నా చాలా ఇష్టం. ఎంచక్కా పట్టు పరికిణీలు,గాజులు,గొలుసులు పెట్టుకోవచ్చు. నాకు జుట్టు చాలా బారుగా వుండేది కనుక సవరం లేకుండా నే కుప్పెలు పెట్టేది అమ్మ.నగలు పెట్టమని ఆవిడని  సతాయించి పెట్టించు కునేదాన్ని.తల నిండా పూలు  పెట్టాల్సిందే లేక పోతే గొడవే.ఇక ఫంక్షన్ లో గెస్టులకు పసుపు,కుంకుం,పువ్వులు ఇవ్వడానికి కజిన్స్ అందరూ పోటీలు పడి మరీ ఇచ్చే వాళ్ళం.ఇదంతా ఒక ఎత్తయితే మా చిన్నప్పుడు కాటెరింగ్ సెర్విస్ లేదు కనుక,మా పెద్ద తాత గారు , చిన్న తాత గార్లు పెరట్లో గాడి పొయ్యిలు  తవ్వించి వంటలు మొదలు పేట్టే వారు.మా తాత కుర్చీ పక్కన నుంచుని ఆ వ్యవహారం అంతా చూడటం మహా సరదాగా ఉండేది.అప్పట్లో స్వీట్ అంటే లడ్డు నే, ఇంకా కాస్త వున్న వాళ్ళు ఐతే రెండవ స్వీటు ఏదైనా చేసే వాళ్ళు.అప్పట్లో  మైసూరు పాకు,జాంగ్రి,బాదూషా లేదా పాల కోవా చేసే వాళ్ళు..

                లడ్డు చెయ్యాలంటే పెద్ద ప్రహసనం. లడ్డు చేస్తే పెళ్లి వంటలు సగం అయిపోయి నట్టే.లడ్డు కోసం మా పొలం లో పండిన సెనగలు బాగు చేసి పిండి మర పట్టించి రెడీ గా పెట్టుకునే వారు.ఇక వంట వాడు పిండి కలిపి బూందీ పట్టటం మొదలు పెట్టే వాడు.మా తాత ఆరున్నర అడుగుల ఆజానుబాహుడు,కంఠము కంచు.ఆయనకు కోపం రాకుండా జాగ్రత్తగా వంటవాడు కరెక్ట్ గా బూందీ దూస్టుంటాడు. వాడు మా ఆస్థాన వంటవాడు కనుక తేడా రాకుండా జాగ్రత్తగా , మా తాత కు మాటలు చెప్తూ బూందీ తో పాటు చెక్కర పాకం మొదలు పెడతారు. ఇక మా తాత ముందే చెప్తుంటాడు రే పాకం ముదర నివ్వకు మొన్న ఆ పాల్తూరు వాళ్ళ పెళ్లి లో లడ్డు గట్టిగా వుంది,  ఫలానా వాళ్ళ పెళ్లి లో పాకం మరీ పలచన అయి లడ్డు ఎవరికి నచ్చలేదు అని..వాడు భయపడతా భయపడతా పాకం పట్టి బూందీ అంతా కలిపి, మా పెంకుల వసారా లో గడ్డి పరిచి దానిపై ఉతికిన పంచలు పరిచి పెట్టిన వాటి పై పోసి చల్లారపెడతారు. 

      ఇక అప్పుడు తాత గారు ఖాళీ గా తిరుగుతున్న మగ వారిని కేకేసి,ఆడంగులను ,పనివారిని,అందరినీ  చాపలేసి కూచో పెట్టి వుండలు కట్టడానికి పురమాయించి అక్కడే వుండి ఒకే సైజులో కడుతున్నారా లేదా అని గమనిస్తూ వుంటారు. ఈలోగా వంటవాడికి కారం బూందీ కలుప రా పిల్లలకి అని కారం,కరివేపాకు,వెలుల్లి పాయ, వేరుసెనగ విత్తనాలు,ఉప్పు అన్నీ వేయించి కారం బూందీ కలిపించే వారు. ఒక పక్క వుండ కట్టిన లడ్డూలను ముందుగా సారె పెట్ట లో పెట్టించే వారు. ఒక పెద్ద చెక్క పెట్టె ఉండేది,సారె స్వీట్స్ అన్నీ అందులో పెట్టే వారు,దాని నిండుగా లడ్డూలు,అరిశెలు,కజ్జికాయలు,పేణీలు అన్నీ 10రోజుల ముందు నుండీ మా పెద్దమ్మలు,పిన్నులూ,అత్తలూ,అవ్వలూ అందరూ కలిసి రోజూ కొన్ని చేసి పెట్టే వారు. ఆన్నీ నింపి ఆ సారె పెట్టె తాళం వేసే వారు. పిల్లలు అందరూ ఆ పెట్టె చుట్టూ తిరుగుతూ ఉండెవాళ్ళం. మేము కూడా లడ్డూ చుడతాము అని  చెప్పి తినడం మొదలు పెట్టేవాళ్ళం.తాత గారు చూసినప్పుడు వుండలు కట్టినట్టు యాక్షన్ చేసే వాళ్ళం,ఎంతైనా ఆయన కనిపెట్టి మమ్మల్ని అక్కడి నుంచి తరిమేసే వారు. అప్పుడు ఇక కారం బూందీ దగ్గరకు చేరే వాళ్ళం.మా గోల  తట్టు కోలేక తాత గారు ఫ్రెష్ గా పిండి కలిపించి బజ్జీలు వేయించి,విస్తర్లు వేసి బజ్జీలు,బొరుగులు పెట్టే వారు. మేము వేడి వేడి బజ్జీలు అర్చుకొని,ఆర్చుకొని  తింటుంటే,వంటవాడు వాయలు వాయలు గా మా విస్తర్లు నింపే వాడు.తినడం అవగానే మళ్లీ ఆటలు మొదలు..అప్పట్లో అందరూ అంత పెద్ద లడ్డూలు ఒక్కక్కరు ఒకటి లేదా రెండు చులాగ్గా తినేవారు,అయినా ఒబెసిటి ఎవరికీ ఉండేది కాదండీ.. 

Tuesday, 29 September 2020

తెలుగు భాష

మన మాతృ భాష తెలుగు గురించి,తెలుగుని కాపాడుకోవడం కోసం ఎంతో మంది వ్యక్తులు,రచయితలు ఎలా శ్రమ  పడుతూ వున్నరో తెలుస్తూ ఉంది.తెలుగు భాష గొప్ప తనం గురించి ఎందరెందరో ఎన్నో రకాలు గా చెప్పారు. ఈరోజు నేను కొత్త గా తెలుగు భాష గురించి చెప్పాలంటే ఎమీ లేదు. కానీ నిన్న స్వర్ణ కమలం సినిమా పాటలు వింటుంటే ఒక పాట లొ  తూరుపు వేదిక పై వేకువ నర్తకి వై ధాత్రి ని మురిపించే అనే  చరణం ధ్యాసగా విన్నా. ఇంత  అందమైన పద విన్యాసం మనకు పరిచయం చేసిన ఆ మహానుభవుడైన విశ్వనాథ్ గారికి,రాసిన రచయిత గారికి నమస్సుమాంజలులు..చిన్న చిన్న పదాలూ,చక్కటి భావం తో వింటూంటే ఒక రకమైన హాయిని కలిగించే పద ప్రయోగాలు ఎన్నెన్నో.ఒక మంచి ఙ్ఞాపకం సన్న జాజుల పరిమళం లా మనల్ని చుట్టుముడుతుంది.అలా పొన్న చెట్ట్లు,పండు వెన్నెల,విరజాజులు,మధుసీమలు,మలయానిలము, పలుకులు బంగారమవటం ,సంజకెంజాయలు,సంధ్యా రాగాలు,సుమబాలలు,రాధామనొహరాలు,ఆకాశదేశాలు, మేఘామాలికలు,మేఘసందేశాలు,శ్రావణ మేఘాలు,శరత్కాలపు వెన్నెలలు,కమల నయనాలు, సంధ్యా కాంతలు,హేమంత రుతురాగాలు, అపరాహ్ణం వేళలు,వానవిల్లులు, శిశిరవాసంతాలు, కలకూజితాలు ఇలాంటి మాటలు మన జెనెరేషన్ వాళ్లకి బాగా విన్నవి,వాడినవి కొన్ని. మన ముందు తరం వారు కవితావేశము లో  విరివిగా వాడి మనకు అందించినవి. ఎలాంటి సమయం లో నైనా ఇలాంటి పదాలు విన్నా మనసంతా అదో రకం మైన సంతోషం తో, వింత హాయికి గురి అవుతుంది. దానికి కారణం తెలియకుండా వాటి మీద మక్కువ పెంచుకొవటము వల్ల కావచ్చు. కానీ ఈ తెలుగు భాష ప్రయోగాల్లోని మాధుర్యాన్ని నేను మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తూ వున్నాను.నా పిల్లలు,నెక్స్ట్ జెనెరేషన్ వీటన్నిటినీ మిస్స్ అవుతుందని తుమ్మెదల ఝంకారం లా గుర్తు చేస్తూనేవుంటుంది.....