నాకు పెళ్ళిళ్ళు అన్నా ,చిన్నా చితకా ఫంక్షన్ లు అన్నా చాలా ఇష్టం. ఎంచక్కా పట్టు పరికిణీలు,గాజులు,గొలుసులు పెట్టుకోవచ్చు. నాకు జుట్టు చాలా బారుగా వుండేది కనుక సవరం లేకుండా నే కుప్పెలు పెట్టేది అమ్మ.నగలు పెట్టమని ఆవిడని సతాయించి పెట్టించు కునేదాన్ని.తల నిండా పూలు పెట్టాల్సిందే లేక పోతే గొడవే.ఇక ఫంక్షన్ లో గెస్టులకు పసుపు,కుంకుం,పువ్వులు ఇవ్వడానికి కజిన్స్ అందరూ పోటీలు పడి మరీ ఇచ్చే వాళ్ళం.ఇదంతా ఒక ఎత్తయితే మా చిన్నప్పుడు కాటెరింగ్ సెర్విస్ లేదు కనుక,మా పెద్ద తాత గారు , చిన్న తాత గార్లు పెరట్లో గాడి పొయ్యిలు తవ్వించి వంటలు మొదలు పేట్టే వారు.మా తాత కుర్చీ పక్కన నుంచుని ఆ వ్యవహారం అంతా చూడటం మహా సరదాగా ఉండేది.అప్పట్లో స్వీట్ అంటే లడ్డు నే, ఇంకా కాస్త వున్న వాళ్ళు ఐతే రెండవ స్వీటు ఏదైనా చేసే వాళ్ళు.అప్పట్లో మైసూరు పాకు,జాంగ్రి,బాదూషా లేదా పాల కోవా చేసే వాళ్ళు..
లడ్డు చెయ్యాలంటే పెద్ద ప్రహసనం. లడ్డు చేస్తే పెళ్లి వంటలు సగం అయిపోయి నట్టే.లడ్డు కోసం మా పొలం లో పండిన సెనగలు బాగు చేసి పిండి మర పట్టించి రెడీ గా పెట్టుకునే వారు.ఇక వంట వాడు పిండి కలిపి బూందీ పట్టటం మొదలు పెట్టే వాడు.మా తాత ఆరున్నర అడుగుల ఆజానుబాహుడు,కంఠము కంచు.ఆయనకు కోపం రాకుండా జాగ్రత్తగా వంటవాడు కరెక్ట్ గా బూందీ దూస్టుంటాడు. వాడు మా ఆస్థాన వంటవాడు కనుక తేడా రాకుండా జాగ్రత్తగా , మా తాత కు మాటలు చెప్తూ బూందీ తో పాటు చెక్కర పాకం మొదలు పెడతారు. ఇక మా తాత ముందే చెప్తుంటాడు రే పాకం ముదర నివ్వకు మొన్న ఆ పాల్తూరు వాళ్ళ పెళ్లి లో లడ్డు గట్టిగా వుంది, ఫలానా వాళ్ళ పెళ్లి లో పాకం మరీ పలచన అయి లడ్డు ఎవరికి నచ్చలేదు అని..వాడు భయపడతా భయపడతా పాకం పట్టి బూందీ అంతా కలిపి, మా పెంకుల వసారా లో గడ్డి పరిచి దానిపై ఉతికిన పంచలు పరిచి పెట్టిన వాటి పై పోసి చల్లారపెడతారు.
ఇక అప్పుడు తాత గారు ఖాళీ గా తిరుగుతున్న మగ వారిని కేకేసి,ఆడంగులను ,పనివారిని,అందరినీ చాపలేసి కూచో పెట్టి వుండలు కట్టడానికి పురమాయించి అక్కడే వుండి ఒకే సైజులో కడుతున్నారా లేదా అని గమనిస్తూ వుంటారు. ఈలోగా వంటవాడికి కారం బూందీ కలుప రా పిల్లలకి అని కారం,కరివేపాకు,వెలుల్లి పాయ, వేరుసెనగ విత్తనాలు,ఉప్పు అన్నీ వేయించి కారం బూందీ కలిపించే వారు. ఒక పక్క వుండ కట్టిన లడ్డూలను ముందుగా సారె పెట్ట లో పెట్టించే వారు. ఒక పెద్ద చెక్క పెట్టె ఉండేది,సారె స్వీట్స్ అన్నీ అందులో పెట్టే వారు,దాని నిండుగా లడ్డూలు,అరిశెలు,కజ్జికాయలు,పేణీలు అన్నీ 10రోజుల ముందు నుండీ మా పెద్దమ్మలు,పిన్నులూ,అత్తలూ,అవ్వలూ అందరూ కలిసి రోజూ కొన్ని చేసి పెట్టే వారు. ఆన్నీ నింపి ఆ సారె పెట్టె తాళం వేసే వారు. పిల్లలు అందరూ ఆ పెట్టె చుట్టూ తిరుగుతూ ఉండెవాళ్ళం. మేము కూడా లడ్డూ చుడతాము అని చెప్పి తినడం మొదలు పెట్టేవాళ్ళం.తాత గారు చూసినప్పుడు వుండలు కట్టినట్టు యాక్షన్ చేసే వాళ్ళం,ఎంతైనా ఆయన కనిపెట్టి మమ్మల్ని అక్కడి నుంచి తరిమేసే వారు. అప్పుడు ఇక కారం బూందీ దగ్గరకు చేరే వాళ్ళం.మా గోల తట్టు కోలేక తాత గారు ఫ్రెష్ గా పిండి కలిపించి బజ్జీలు వేయించి,విస్తర్లు వేసి బజ్జీలు,బొరుగులు పెట్టే వారు. మేము వేడి వేడి బజ్జీలు అర్చుకొని,ఆర్చుకొని తింటుంటే,వంటవాడు వాయలు వాయలు గా మా విస్తర్లు నింపే వాడు.తినడం అవగానే మళ్లీ ఆటలు మొదలు..అప్పట్లో అందరూ అంత పెద్ద లడ్డూలు ఒక్కక్కరు ఒకటి లేదా రెండు చులాగ్గా తినేవారు,అయినా ఒబెసిటి ఎవరికీ ఉండేది కాదండీ..
No comments:
Post a Comment